"దేశం ఆర్థికశక్తిగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలి"
దేశాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. జాతిపిత కలలుగన్న భారతావనిని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలని.. భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కాకినాడ జేఎన్టీయూ ఏడో స్నాతకోత్సవానికి కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. వర్సిటీ ఆవరణలో మొక్క నాటి, రక్తదాన శిబిరం ప్రారంభించారు. బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావుకు డాక్టరేట్... ఇంజినీరింగ్ పట్టభద్రులకు పట్టాలను గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రతిష్ఠాత్మక వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని పారిశ్రామికరంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందని... భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్ బలమైన అణుశక్తిగా ఎదిగిందని వెల్లడించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గాంధీ కలలుగన్న భారతదేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.