తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి సామర్లకోట మీదుగా రాజమహేంద్రవరం వెళ్లే రహదారుల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. కోనసీమలో రాజవరం - పొదలాడ ఆర్‌అండ్‌బీ రోడ్డు, అమలాపురం - బొబ్బర్లంక రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. కొత్తపేట బోడిపాలెం వంతెన నుంచి ముక్తేశ్వరం వంతెన రహదారిలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదాలకు రకరకాల కారణాలు కనిపిస్తున్నా.. వాటిని సరిదిద్దే చర్యలు లేవు. వాహన తనిఖీలు సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడంలేదు.
రహదారి భద్రతపై దృష్టి..
జిల్లాలో ఈ ఏడాది రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించాం. యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. కీలక రహదారులపై నిఘా పెంచుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాం. పెట్రోలింగ్ ద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టడంతో పాటు, నిబంధనల అతిక్రమణపైనా దృష్టి సారిస్తాం. - అద్నాన్ నాయీo అస్మి, జిల్లా ఎస్పీ
0.89% అధ్వాన రహదారులు
రహదారులు ప్రమాదాలకు ఆలవాలంగా మారాయి. అధ్వాన గతుకుల దారుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మరుతోంది. జిల్ల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 4,285 కి.మీ. పొడవున రహదారులు ఉంటే 637.29 కి.మీ. పొడవున దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు 6,585 కి.మీ. పొడవున ఉంటే.. 1,500 కి.మీ. పొడవున దెబ్బతిన్నాయి.
0.63% ప్రయాణికుల తప్పిదాలు
కదులుతున్న వాహనం ఎక్కడం, దిగడం లాంటివీ, ఫుట్‌పాత్ ప్రయాణాలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
0.35% వాహన పరిస్థితి కారణంగా...
జిల్లాలో తిరుగుతున్న ఇరుగు పొరుగు వాహనాలు అన్నిరకాలు కలిపి 11.50 లక్షలు ఉన్నాయి. వీటిలో 15 ఏళ్లు నిండి.. కాలం చెల్లిన వాహనాలతో కాలుష్యానికి సెగతోపాటు ప్రమాదాలకూ ఆస్కారం కలుగుతోంది. వాహన సామర్థ్య తనిఖీలు సమర్థంగా జరిగితే పరిస్థితి కొంతమేర కుదుటపడే అవకాశం ఉంది.
1.83% పాదచారుల పొరపాట్లతో..
ట్రాఫిక్ నిబంధనలపై చాలా మంది ప్రయాణికులు, పాదచారులకు అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. కాకినాడ స్మార్ట్‌సిటీలో రూ.కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో పాదచారుల, వాహనచోదకుల తప్పిదాలు ప్రమాదాలకు తావిస్తున్నాయి.