వేట నిషేధంతో తీవ్ర ఇబ్బందుల్లో మత్స్యకారులు - తూర్పుగోదావరి జిల్లాలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులు
లాక్డౌన్ కారణంగా మత్స్యకారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సముద్రంలో వేట నిషేధం అమల్లోకి రావటంతో వీరి జీవితం ప్రశ్నార్థకంగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో 20 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 20 కుటుంబాలు మాత్రమే పెద్ద బోటులపై సముద్రంలో వేట సాగించే స్థాయి కలవారు ఉన్నారు. మిగిలిన వారంతా నాటు పడవలు, తెప్పలపై గోదావరి నది పాయల్లో రోజువారి వేటను సాగిస్తూ కుటుంబాలను పోషించేవారు. గత నెల 24న ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్‌తో వీరంతా మత్స్య సంపద వేటను వదిలేసి ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నెల 15 నుండి సముద్ర జలాలలో వేట నిషేధం అమల్లోకి రావడంతో సరుకులు కొనేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక నానా అవస్థలు పడుతున్నారు. వీరి పరిస్థితిని గుర్తించిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ దాతల సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశారు.