ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నీరు మిగిల్చిన ఏలేరు... భారీగా పంటనష్టం - East godavari news in telugu

తూర్పు గోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో ఏలేరు, సుబ్బారెడ్డిసాగర్, చంద్రబాబుసాగర్​లు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఏలేరు దిగువన ఉన్న కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లోని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వరద నీరు పంటపొలాలను ముంచెత్తడం వల్ల రైతుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కన్నీరు మిగిల్చిన ఏలేరు... వందల ఎకరాల్లో పంటనష్టం

By

Published : Oct 26, 2019, 11:39 PM IST

కన్నీరు మిగిల్చిన ఏలేరు... భారీగా పంటనష్టం
గత నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికందిన పంట నీటిపాలైనందుకు రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రత్తిపాడు లోని ప్రధాన జలాశయాలైన ఏలేరు, సుబ్బారెడ్డిసాగర్‌, చంద్రబాబుసాగర్‌లు పూర్తిగా నిండిపోయాయి. అదనపు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. దీని వల్ల దిగువ ప్రాంతాలైన కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఏలేరు జలాశయం నుంచి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టడం వల్ల దిగువ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మూడు రోజులుగా పంటపొలాలు నీటిలోనే ఉండడం వల్ల రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాలతో వేల ఎకరాల్లో పంట పూర్తిగా నాశనమైంది.

చెరువుల్లా పొలాలు

ఎకరానికి 25 నుంచి 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన పంట నీట మునగడం చూసి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రత్తిపాడులోని ఒమ్మంగి, పోతులూరు, ఏలూరు గ్రామాల్లో అధిక శాతం పంటపొలాలు నీట మునిగాయి. మెట్ట ప్రాంతాల్లో కూరగాయలు, పత్తి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో నీరు పంటపొలాల్లోనే కాకుండా గ్రామాల్లోకి చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పంటకాల్వలపై పర్యవేక్షణ లేకపోవడం, ఎక్కడికక్కడ కాల్వలపై అడ్డుగా ఆక్రమణలు చోటుచేసుకోవడం వల్ల వరద నీరు పోవడానికి మార్గం లేక, పంటపొలాల్లోకి చేరుతుందని కర్షకులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలపై ఆక్రమణలు తొలగించి, నీటి ప్రవాహాన్ని అదుపు చేయాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details