ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'టోల్ ప్లాజా కోసం భూములు ఇవ్వం'

టోల్ ప్లాజా కోసం దౌర్జన్యంగా భూములు తీసుకుంటే ఆత్యహత్యలు చేసుకుంటామని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట రైతులు తేల్చి చెప్పారు. రోడ్డు విస్తరణ కోసమైతే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులకు తెలిపారు.

By

Published : Feb 28, 2021, 12:16 PM IST

eethakota toll plaza
ఈతకోట టోల్ ప్లాజా

టోల్ ప్లాజా కోసం దౌర్జన్యంగా భూములు తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ టోల్ ప్లాజా విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకున్న భూముల పరిశీలనతో పాటు.. భూసేకరణ సొమ్ములను రైతులు తీసుకోవాలని కోరుతూ అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జాతీయ రహదారి విభాగం అధికారులు ఈతకోట టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న రైతులు తమ భూమిని టోల్​ప్లాజా కోసం ఇవ్వమని నిరసన వ్యక్తం చేశారు.

తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులతో సబ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విస్తరణకు సంబంధించి 70 శాతం ప్రక్రియ పూర్తయిందని.. రైతులు ప్రభుత్వం మంజూరు చేసిన నగదు తీసుకుని, ఏమైనా ఇబ్బందులు ఉంటే విశాఖపట్నంలోని ట్రిబ్యునల్​కు వెళ్లాలని అధికారులు సూచించారు. తాము విస్తరణకు భూములు ఇవ్వబోమన్న రైతులు.. అధికారుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. రోడ్డు విస్తరణ కోసం భూములు ఇస్తాం కానీ.. టోల్ ప్లాజా కోసం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details