2014 ఎన్నికల్లో 12 చోట్ల తెదేపా విజయకేతనం ఎగరవేసింది. వైఎస్సార్సీపీ 5 చోట్ల మాత్రమే విజయం సాధించింది. కానీ ఈసారి వైకాపా పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ..14 చోట్ల విజయం సాధించింది.
తెదేపాకు ఆ నాలుగు...
జిల్లాలో ఆసక్తి రేపిన నియోజకవర్గం పెద్దాపురం. ఇక్కడ నుంచి తెదేపా తరపున ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప బరిలో నిలిచారు. వైకాపా తరఫున మాజీ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణి పోటీలో ఉన్నారు. ఇరువురూ.. తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసినా చివరకు చిన రాజప్పనే విజయం వరించింది. మండపేటలో తెదేపా తరఫున వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. రాజమండ్రి సిటీ నుంచి తెదేపా తరపున ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు.తెదేపా సీనియర్ నేత ఎర్రనాయుడు కుమార్తె అయిన భవానీ తన సమీప వైకాపా ప్రత్యర్థి రౌతు సూర్యప్రకాశ్ రావుపై విజయం సాధించారు. అత్యంత ఆసక్తిగా మారిన మరో నియోజకవర్గం రాజమహేంద్రవరం గ్రామీణం. ఇక్కడ నుంచి తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బరిలో నిలవగా... వైకాపా తరఫున ఆకుల వీర్రాజు బరిలో నిలిచారు. ఫలితాలలో ఉత్కంఠ రేపిన ఈ నియోజకవర్గంలో వీర్రాజుపై బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు.
పద్నాలుగుతో వైకాపా ప్రభంజనం
ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రంపచోడవరంలో వైకాపా అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి తెదేపా అభ్యర్థి వంతల రాజేశ్వరిపై విజయం సాధించారు. ఇక్కడి నుంచి జనసేన మద్దతుతో బరిలో నిలిచిన సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఓటమిపాలయ్యారు. జిల్లాలో మరో కీలక నియోజకవర్గమైన తునిలో వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయకేతనం ఎగరవేశారు. తెదేపా నుంచి బరిలోకి దిగిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడుపై ఆయన విజయం సాధించారు. కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంత లక్ష్మిలు ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైకాపా అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. నగరం నుంచి ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి విజయం సాధించగా...రూరల్ నుంచి కురసాల కన్నబాబు గెలిచారు. ముమ్ముడివరం నియోజకవర్గంలో తెదేపా, వైకాపాతోపాటు జనసేన గట్టి పోటీనివ్వగా చివరకు వైకాపా అభ్యర్థి పొన్నాడ వెంకట సతీశ్‌ను విజయం వరిచింది. తెదేపా అభ్యర్థి దాట్ల సుబ్బరాజు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్సీకి కేటాయించిన గన్నవరం, అమలాపురం నియోజకవర్గంలో వైకాపా పాగా వేసింది. తెదేపా అభ్యర్థులు నేలపూడి స్టాలిన్ బాబు, అయితాబత్తుల ఆనందరావులపై వైకాపా అభ్యర్థులు కొండేటి చిట్టిబాబు, పి.విశ్వరూప్‌లు జయకేతనం ఎగరవేశారు.