"రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.. ఈ దాడులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి" అని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలో జరిగిన దాడులు చాలా బాధాకరమన్న ఆయన.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలపై ఏనాడూ దాడులు చేయలేదని గుర్తుచేశారు.
తెదేపా నేతల ఇళ్లపై మూక దాడులు చేస్తుంటే.. రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనేంతగా బాధ కలుగుతోందని ఆవేదన చెందారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విషయంపై గవర్నర్ స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని రెడ్డి సుబ్రహ్మణ్యం కోరారు.