తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం బూరుగువాడలో 11 మంది గిరిజన చిన్నారులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు చైతన్య, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గుల్లేటివాడ గ్రామానికి చెందిన వంజం బుచ్చయ్య తన సొంత పనుల నిమిత్తం రేఖపల్లి వచ్చి తిరిగి వెళుతూ, ఓ కిరాణా దుకాణంలో తినుబండారాలను కొనుక్కుని తీసుకువెళ్లాడు. దారి మధ్యలోని బూరుగువాడ గ్రామంలోని తన బంధువైన కనుగుల భద్రమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడి పిల్లలకు తాను తీసుకొచ్చిన తినుబండారాలను ఇచ్చాడు. వాటిని వారు స్నేహితులతో పంచుకుని తిన్నారు.
కొద్దిసేపటి తర్వాత వారిలో అయిదుగురికి వాంతులు, విరేచనాలు కావటంతో రేఖపల్లి వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దారు శ్రీధర్‌లకు తెలియజేసి, 108 అంబులెన్సుతో బూరుగువాడకు చేరుకున్నారు. మిగిలిన చిన్నారులను కూడా వైద్యశాలకు తీసుకువచ్చి వైద్యం అందించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసరమైతే ఏరియా వైద్యశాలకు తరలిస్తామన్నారు. ఈ సంఘటనపై ఎస్సై వెంకటేష్ విచారణ చేపట్టి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు.