గంగపుత్రుల వారసులకు మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ బాసట వారసత్వ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకుంటున్నవారిలో మత్స్యకారులు ముందు వరుసలో ఉంటారు.కష్టాలు ఎదురైనా...జీవనసాగరంలో ఎదురీదుతుంటారు.ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ కుటుంబ పోషణ కోసం...నడిసంద్రంలో నానాయాతన పడుతుంటారు.కడలికల్లోలంగా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి వేటకు వెళ్తుంటారు.కొందరు ఇందులో తర్ఫీదు పొందితే...మరికొందరకి ఉండదు.అలాంటి వారికోసం కాకనాడలో మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ...ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసింది.
సముద్రంలో వ్యవహరించాల్సిన తీరుపై గంగపుత్రులకు నూతన విధానాలు పరిచయం చేస్తోంది.చేపల వేటకు సంబంధించిన...ప్రాథమిక విషయాల నుంచి బోటు నడపడం,వలల అల్లికపై శిక్షణ అందిస్తోంది.
టెండాల్ కమ్ డ్రైవర్ కోర్సు పేరిట మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏడాది కోర్సులో చేరేందుకు యువకులు ఆసక్తి చూపుతున్నారు.మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థలో ప్రస్తుత సంవత్సరం55మంది శిక్షణ పొందుతున్నారు.మన రాష్ట్రంతోపాటు తెలంగాణ,పుదుచ్ఛేరికి చెందిన వారు శిక్షణ పొందుతున్నారు.
పదో తరగతి విద్యార్హతతో మత్స్యకార యువతతో పాటు ఆసక్తి కలిగిన వారూ...కోర్సులో ప్రవేశం పొందవచ్చు.అభ్యర్థుల కనుదృష్టి,శారీరక దారుఢ్యం,వ్యక్తిత్వం ఆధారంగా ఎంపిక చేస్తారు.ఏటా జులై చివరి వారంలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
తరగతి గదుల్లో పాఠాలు బోధించడం సహా క్షేత్రస్థాయిలో ప్రయోగపూర్వకంగా అవగాహన కల్పిస్తున్నారు.ప్రతి విద్యార్థి సుమారు60రోజులపాటు సముద్రంలో ఉండేలా ప్రణాళిక అమలు చేస్తారు.ఇక్కడ శిక్షణ పొందుతున్న యువతకు...ప్రభుత్వం నుంచి నెలకు వెయ్యి రూపాయల భృతి అందిస్తోంది.దూరప్రాంతాల విద్యార్థులకు ఉచిత వసతి సదుపాయం కల్పిస్తున్నారు.ఇక్కడ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పత్రం అందిస్తారు.తద్వారా కేంద్ర జలసంఘం,పర్యాటక రంగం,నౌకాశ్రయాల్లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు లభిస్తున్నాయి.