కేంద్ర పాలిత ప్రాంతం యానాం అసెంబ్లీ ఎన్నికల్లో.. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్.. ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. ఆయన తండ్రి గొల్లపల్లి గంగాధర ప్రతాప్.. 15 ఏళ్ల క్రితం యానాం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఓ సారి, భాజపా అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా.. ఓడిపోయారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం పొందారు. ఇప్పుడు ఆయన తనయుడైన శ్రీనివాస్ అశోక్.. తండ్రి మాదిరిగానే స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
శ్రీనివాస్ అశోక్ తరఫున అతని తల్లి, భార్య.. ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఓటు వేసి గెలిపించాలంటూ.. విస్తృత ప్రచారం చేస్తున్నారు. పుదుచ్చేరి మాజీ సీఎం, కాంగ్రెస్ పుదుచ్చేరి అధ్యక్షుడు రంగస్వామిపై పోటీలో నిలబడిన అశోక్ కు విజయాన్ని అందించాలని కోరుతున్నారు. పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. యానాం నియోజకవర్గానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సుంకర కార్తీక్, ఇండిపెండెంట్ అభ్యర్థులు దుర్గాప్రసాద్, దవులూరి మాత్రమే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు కనీసం కరపత్రాలు కూడా ప్రచురించలేదు.