3రోజుల నరకయాతన...
కిడ్నాపర్లు చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.అభం సుభం తెలియని పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు.వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి జషిత్ అనే ఐదేళ్ల బాలుడును దుండగులు ఎత్తుకెళ్లారు.వారి తల్లిదండ్రులు పిల్లాడి జాడ తెలీక బోరుమన్నారు. 3రోజులపాటు నరకయాతన అనుభవించారు.
విస్తృతంగా గాలింపు...
పోలీసులు...వార్తా ఛానళ్లు,సామాజిక మాధ్యమాల్లో బాలుడి కోసం గాలించారు.సామాన్య ప్రజలు సైతం పసివాడు క్షేమంగా తిరిగి రావాలని ఫొటో షేర్ చేశారు. 17బృందాలు ఈ కేసు ఛేదించేందుకు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ నయీం.మండపేటలోనే మకాం వేసి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.సోమవారం రాత్రి7గంటల నుంచి జిల్లాలోని రైల్వేస్టేషన్లు,బస్‌స్టాప్‌లలో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి అనుమానితుల చిత్రాలు విడుదల చేశారు.ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా...కిడ్నాపర్లు ఎటూ పారిపోకుండా జాగ్రత్త పడ్డారు.
భయపడిన కిడ్నాపర్లు...
పోలీసులు,పౌరసమాజం అప్రమత్తమయ్యేసరికి కిడ్నాపర్లు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.పిల్లాణ్ని కిడ్నాప్ చేసి3రోజులైనా...జిల్లా దాటే వీల్లేకుండా పోయింది.అదే కిడ్నాపర్ల వెన్నులో వణుకు పుట్టించింది.పరిస్థితి గమనించి బాలుణ్ని వదిలివెళ్లారు.పోలీసుల వ్యూహాత్మక ప్రచారం...జనచైతన్యం...ఈ కేసులో కీలకంగా మారింది.ఏడెనిమిది కిలోమీటర్లు పరిధి దాటి వెళ్లలేకపోయారు నిందితులు.