ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

black fungus: జీజీహెచ్‌లో 57 మంది బాధితులు.. చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

బ్లాక్‌ ఫంగస్‌.. కరోనా బాధితులను భయపెడుతోంది. మొదటి దశ కొవిడ్​ వ్యాప్తిలో ఈ ఫంగస్​ అంతగా ప్రభావం చూపలేదని... రెండవ దశలో కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. కాకినాడ జీజీహెచ్​లో 57 మంది బ్లాక్‌ ఫంగస్​కు చికిత్స పొందుతుండగా... గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్​ తెలిపారు.

collector muralidhar
బాధితులను పరామర్శిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

By

Published : May 31, 2021, 11:13 AM IST

కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిని బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్‌ మైకోసిస్‌) భయపెడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసుల తాకిడి పెరగడంతో కాకినాడ జీజీహెచ్‌లో 40 పడకలతో ప్రత్యేక విభాగం అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ 57 మంది చికిత్స పొందుతుండగా, గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.మహాలక్ష్మి ఆదివారం తెలిపారు. 48 మంది ప్రత్యేక వార్డులో, తొమ్మిది మంది కొవిడ్‌ వార్డుల్లో, ఇద్దరు హోమ్‌ క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 87 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవ్వగా 8 మంది దీంతోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు వెల్లడించారు. ఆరుగురికి శస్త్ర చికిత్సలు చేయగా, 22 మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 18 నెలల బాలుడి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, రెండ్రోజుల్లో సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు 31,386 ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలన్న తర్జనభర్జనలో అంతా ఉంటే బ్లాక్‌ ఫంగస్‌ గుబులు తెరమీదికి వచ్చింది.

జీజీహెచ్‌లో ప్రత్యేక విభాగం

* బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి నిర్ధారణకు కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ తరహాలోనే ముక్కులోంచి ద్రవాలు సేకరించి జీజీహెచ్‌లోని మైక్రో బయాలజీ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నారు. ఫలితం అరగంట నుంచి గంటలోపు వస్తోంది.

సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ల ద్వారా ఫంగస్‌ ప్రభావాన్ని గుర్తించే వీలుంది... నిర్ధారణకు వచ్చాక తీవ్రత ఆధారంగా వైద్యం లేదంటే.. శస్త్రచికిత్సల దిశగా చర్యలు తీసుకుంటారు. తాజాగా ముగ్గురికి శస్త్రచికిత్సలు చేశారు.

* కాకినాడ జీజీహెచ్‌లో ఈఎన్టీ, నేత్ర విభాగాల నిపుణులతోపాటు న్యూరో ఫిజీషియన్, న్యూరో సర్జన్, ఎండో క్రైనాలజిస్ట్, ఫిజీషియన్లతో కూడిన బృందాని బ్లాక్‌ ఫంగస్‌ విభాగంలో వైద్యసేవలకు అందుబాటులో ఉంచారు.

* బ్లాక్‌ ఫంగస్‌ వైద్యానికి అవసరమైన ఏంపోటెరిసన్‌- బి ఇంజక్షన్లు, పోసకోనజోల్‌ ఇంజక్షన్‌/ మాత్రలతోపాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శస్త్రచికిత్సలకు అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

మాస్క్‌

వాడిన మాస్కు పదేపదే వాడితే బ్లాక్‌ ఫంగస్‌ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మాస్కుల వినియోగంలో అప్రమత్తత అవసరం. జిల్లా జనాభా 56 లక్షలు. వీరంతా అప్రమత్తం కావల్సిన తరుణమిది. తరచూ వాడే వీలున్న మాస్కులైతే వాటి శుభ్రతపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలి.

కోలుకున్న వారు..

కొవిడ్‌ సోకినవారు వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్టెరాయిడ్లు వినియోగించకూడదు. మధుమేహం, ఇతర రుగ్మతలు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి 1,91,368 మంది కోలుకున్నారు. వీరు మరింత జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతున్నారు.

ప్రాణవాయువు

జిల్లాలో కొవిడ్‌ తీవ్రత పెరిగిన తర్వాత పరిశ్రమలు, కర్మాగారాల అవసరాలకు ఆక్సిజన్‌ సరఫరాను నిలిపివేసి.. వైద్యశాలల్లో కొవిడ్‌ రోగుల అవసరాలకు తరలించారు. ఈ నేపథ్యంలో నాణ్యతపై మరింత దృష్టిసారించాలి.

ఫ్లో మీటర్లు

‘ఆక్సిజన్‌ వ్యవస్థలో నీళ్లతో నింపే ఫ్లో మీటర్ల శుభ్రతపై దృష్టి పెట్టాలి. దీనికి సెలైన్‌ నీటినే వాడాలి. తరచూ శుభ్రం చేసేలా అప్రమత్తం కావాలి. జిల్లాలోని వైద్యశాలల్లో ఏప్రిల్‌లో 4,068 మంది చికిత్స పొందితే.. ఈ నెలలో ఏకంగా 10 వేల మందికిపైనే ఆసుపత్రుల్లో చేరారు. ఈ క్రమంలో యాజమాన్యాలు మరింత శ్రద్ధ చూపాలి.

లక్షణాలుంటే సంప్రదించండి..

బ్లాక్‌ ఫంగస్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ఏడు నుంచి 30 రోజుల్లోపు ఎప్పుడైనా రావచ్చు. గతంలో ఏడాదికి ఒకటెండ్రు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైతే.. కొవిడ్‌ రెండోదశలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది అవగాహన లేమి వల్ల యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు ఎక్కువగా వాడడం, మధుమేహం నియంత్రణలో ఉంచుకోకపోవడంతో సమస్య వస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులున్నవారికీ ఇబ్బందే. ఒకే మాస్కు ఎక్కువసార్లు వాడడం శ్రేయస్కరం కాదు. రక్తంలో జింకు, ఐరన్‌ (ఫెర్రిటిన్‌) శాతం ఎక్కువగా ఉన్నా సోకే ఆస్కారం ఉంటుంది. అనుమానిత లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. - డాక్టర్‌ యు.సుధీర్, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్, ఈఎన్టీ విభాగం, జి.జి.హెచ్‌

అప్రమత్తం చేశాం..

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌కు కారణాలపై ఆరా తీస్తున్నాం. పరిశ్రమలకు వినియోగించే ఆక్సిజన్‌ వైద్య అవసరాలకు వాడే క్రమంలో అందులో మలినాలు ఉంటే బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఎక్కించే క్రమంలో ఫ్లో మీటరు శుభ్రంగా లేకపోతే ఫంగస్‌కు ఆస్కారం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. అలాంటి పరిస్థితి జిల్లాలో లేదు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేషన్‌ స్థాయి ఆసుపత్రుల్లో 94 శాతం ఉంటే.. పరిశ్రమల ఆక్సిజన్‌లో 99 శాతం ఉన్నట్లు తెలిసింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఎక్కించే క్రమంలో శుభ్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొత్తగా నమోదవుతున్న కేసులు పరిశీలిస్తే.. ఈ వాదనలకు భిన్నంగా స్టెరాయిడ్లు ఎక్కువగా వాడని వారూ.. ఆక్సిజన్‌ అవసరం లేకుండా కోలుకున్నవారూ బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. - డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌

ఇదీ చదవండి:

కృష్ణపట్నంలో కరోనా... మరో 27 మందికి స్వల్ప లక్షణాలు

ABOUT THE AUTHOR

...view details