BJP State Core Committee Meeting : అధికార వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలలో ఎండగడతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ దోపిడి, అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని, పోరాటానికి సమరశంఖం పూరించాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్రమంత్రి మురళీధరన్, దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీలు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపార వేత్త తులసి రామచంద్రప్రభు.. ఆయన కుమారుడితో కలిసి బీజేపీలో చేరారు.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసి అధోగతి పాలు చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకలను ఎండగట్టాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిందని వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామనే హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అభివృద్ధి చేస్తామని వైసీపీ ప్రభుత్వం శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.