తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కెనరా బ్యాంకులో నగదు, బంగారు ఆభరణాలు మాయమైన ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈనెల 7న మధ్యాహ్నం సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో క్యాషియర్ క్యాబిన్‌లో ఉన్న రూ.9.23 లక్షలు, ఆ రోజు తాకట్టుకు వచ్చిన 322 గ్రాములు బంగారం మాయమయ్యాయి. తాత్కాలిక ఉద్యోగి లేకపోవడం, సీసీ కెమోరాలను అతనే ఆఫ్ చేయడంతో అనుమానం వచ్చి బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ కొనసాగుతోంది.
ఈ క్రమంలో బ్యాంకులోని రికార్డులు, గతంలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు ఉన్నాయా లేవా అనే కోణంలో తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. ఓ ఖాతాదారుడికి సంబంధించి 20 కాసుల బంగారు ఆభరణాల సంచి లేనట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. ఈ విషయంపై బ్యాంకు సిబ్బంది శుక్రవారం కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ వి.కృష్ణను వివరణ కోరగా బ్యాంకు సిబ్బంది శుక్రవారం స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. ఎస్సై విజయవాడ వెళ్లిన కారణంగా శనివారం తాము వెళ్లి విచారణ చేస్తామని చెప్పారు.