గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా - గర్భిణి మృతి
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణీ ప్రాణాలు తీసిందంటూ ఆరోపిస్తూ కాకినాడ సిద్దార్థ ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిద్ధార్థ ఆస్పత్రిలో గర్భిణి రమాదేవి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే రమాదేవి మృతికి కారణమంటూ భర్త, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. శనివారం రమాదేవికి రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అబార్షన్ చేయాలని సూచించిన వైద్యులు... మత్తు మందు ఎక్కువ మోతాదులో ఇవ్వడంతోనే రమాదేవి చనిపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసు సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు.