కాపులకు కోత... అగ్రవర్ణ పేదలందరికీ కోటా - reservation
అగ్రవర్ణ పేదలకు కల్పించే 10 శాతం రిజర్వేషన్లలలో కాపులకు 5శాతం కేటాయించడం కుదరదని రాష్ట్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం తమ విధానాన్ని మరోసారి తెలిపింది. సుప్రీం తీర్పు ప్రకారం కాపులకు 5శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.
2019- 20 విద్యా సంవత్సరంలో... విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇస్తూ బీసీ సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ అమలుపై ఉత్తర్వులు ప్రత్యేకంగా ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. తాజా ఉత్తర్వుల కారణంగా గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి 5శాతం, కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదం పొందిన చట్టం అమలు కాని పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు గత ప్రభుత్వంలో ఐదు శాతం దక్కిన రిజర్వేషన్లు తాజా ఉత్తర్వులతో 10 శాతానికి చేరనున్నాయి. మరోవైపు అగ్రవర్ణ పేదలకు ధ్రువపత్రాలిచ్చే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించింది.