రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై తెదేపా నేతలు కాకిలెక్కలు చెబుతున్నారని వ్యవసాయ మంత్రి కన్నబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బలపడుతున్నారన్న బాధ తెదేపా అధినేత చంద్రబాబునాయుడుతో సహా ఆ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెదేపా నేతలు హైదరాబాద్లో కూర్చుని మాట్లాడడం కాదని.. రాష్ట్రానికి వచ్చి పల్లెల్లో తిరిగితే రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో తెలుస్తుందని అన్నారు.
సినీరంగ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే అమరావతి బోర్డులు పట్టుకుని డ్రామాలు చేశారని... ఈ దర్శకత్వం ఎవరిదని కన్నబాబు ప్రశ్నించారు. నిలదీయాలనుకున్నవారు గ్రాఫిక్స్ చూపించి మోసం చేసిన చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. 2014లో రూ.87 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఒక్క ఏడాదిలోనే రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా వేశారని కన్నబాబు స్పష్టం చేశారు.