బతుకుకు భరోసానిచ్చే పంట భూములు గోదారి కోతతో కళ్లముందే అదృశ్యమవుతుంటే లంక గ్రామాల రైతులు నిలువునా కన్నీరుమున్నీరవుతున్నారు. ఏటా గోదావరికి వచ్చే వరదలతో లంకల్లోని నదీ తీరాన్ని ఆనుకొని ఉన్న సారవంతమైన భూములు.. కొబ్బరి, అరటి లాంటి పచ్చని పంటలతో పాటే నదీ గర్భంలో కలిసి పోతున్నాయి. ఈ ఏడాది 30 కిలోమీటర్ల మేర బ్యారేజీ ఎగువ, దిగువన ఉన్న ప్రాంతాలు కోతకు గురైనట్టు జలవనరుల శాఖ అంచనా వేయడం పరిస్థితికి నిదర్శనం. ఏకంగా 450 కోట్ల మేర నష్టం జరిగినట్టు అంచనా. కష్టపడి పెంచిన కొబ్బరి తోటలు, పంటలు నదిలో కుప్పకూలుతుంటే రైతులు నిస్సహాయులుగా చూస్తున్నారు.
కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి లాంటి గోదావరి నదీ పాయలను ఆనుకొని ఉన్న ప్రాంతంలో కోత చాలా ఎక్కువగా ఉంటోంది. కొత్తపేట, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల పరిధిలోని తీరం తీవ్ర కోతకు గురవుతోంది. ఆర్.ఏనుగుపల్లి, కె.ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, కటారిలంక, ముంజవరం, తొండవరం, తొట్లపాలెం లంక గ్రామాలు భారీగా కోత బారిన పడుతున్నాయి. బోడసకుర్రు, గోపాయలంక, బోడిగోడితిప్ప, బడుగువాని లంక, సలాదివారిపాలెం, మధ్యలంక, లంక ఆఫ్ ఠానేలంక, గురజాపులంక, కూనాలంకల్లో పంట పొలాలు క్రమంగా నదిలో కలిసిపోతున్నాయి.