ప్రోటోకాల్ ప్రకారం తనకు కేటాయించిన సీట్లో అధికారులు కూర్చోవటంపై శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశం సకాలంలో ప్రారంభం కావకపోవటంపై రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. ఉదయం 11 గంటలకు సమావేశమని చెప్పిన కలెక్టర్ సమయానికి రాకపోవటం సరికాదన్నారు. జడ్పీ ఛైర్మన్ నవీన్‌ను సమావేశానికి ఆహ్వానించకపోవటంపై మండిపడ్డారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం పద్ధతికాదన్నారు.
నేతల మధ్య వాగ్వాదం
అధికారుల సమావేశంలో తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ల నియామకం, రేషన్ డీలర్ల పరిస్థితిపై బుచ్చయ్య వివరణ కోరగా..మధ్యలో వీర్రాజు కలుగజేసుకున్నారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై బుచ్చయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.