గ్రామ, పట్టణ స్థాయిలో కీలకమైన పంచాయతీ, పుర ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 8న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జడ్పీ ఛైర్మన్ పీఠాన్ని జనరల్‌కు కేటాయించారు.
చిత్తూరు జిల్లాలో 1962 నుంచి ఇప్పటివరకూ 18 మంది జడ్పీ ఛైర్మన్లుగా పనిచేశారు. ఇందులో నలుగురు తాత్కాలికంగా వ్యవహరించారు. ప్రస్తుత జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిని గతంలో జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పిలిచేవారు.
తొలి జడ్పీ ఛైర్మన్ అద్దూరి బలరామరెడ్డి జడ్పీ ఛైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా..
కేవీబీపురం మండలం కోవనూరు గ్రామానికి చెందిన అద్దూరి బలరామరెడ్డి 1962లో తొలి జడ్పీ ఛైర్మన్ అయ్యారు. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రెడ్డివారి నాదముని రెడ్డి రెండేళ్లు జడ్పీ ఛైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వియ్యంకుడు, తంబళ్ళపల్లెకు చెందిన టీఎన్ నాగిరెడ్డి 1964-68 వరకు కాంగ్రెస్ నుంచి పరిషత్ ఛైర్మన్ అయ్యారు. తర్వాత టీఎన్ విశ్వనాథరెడ్డి తాత్కాలికంగా కొన్ని రోజులు వ్యవహరించారు.
ప్రత్యక్ష పద్ధతిలో శ్రీనాథరెడ్డి ఎన్నిక
1987లో తొలిసారి తెలుగుదేశం హయాంలో ప్రత్యక్ష పద్ధతిలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జీవీ శ్రీనాథరెడ్డి విజయం సాధించారు. 1991 వరకూ ఆయన ఈ పదవిలో ఉన్నారు. 1991-92 మధ్య వి.కె.శ్రీనివాస్, సిద్ధరామిరెడ్డి పరిషత్ ఛైర్మన్లయ్యారు. ఆ తర్వాత మూడేళ్లు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. 1995లో కార్వేటినగరం జడ్పీ స్థానం నుంచి తెదేపా తరఫున బరిలోకి దిగి విజయం సాధించిన గోవిందస్వామి జడ్పీ పీఠాన్ని అధిష్ఠించారు. 2001- 2006 మధ్య బైరెడ్డిపల్లె జడ్పీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రెడ్డెమ్మ ఛైర్‌పర్సన్ అయ్యారు. అనంతరం శాంతిపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన సుబ్రహ్మణ్యంరెడ్డి పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు. వైకాపా ఆవిర్భావంతో ఆయన రాజీనామా చేయడంతో.. కొంతకాలం బంగారుపాళ్యం నుంచి గెలిచిన కుమార్‌రాజా జడ్పీ కుర్చీని దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు గ్రామీణ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తెదేపా అభ్యర్థి గీర్వాణి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అయ్యారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు ఈ పీఠాన్ని చేజిక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి..
ప్రస్తుతమంటే ఎమ్మెల్యే టికెట్‌కు గట్టి పోటీ ఉంది. గతంలో జడ్పీ ఛైర్మన్ పదవి దక్కిందంటే ఏకంగా మంత్రి అయినట్టేనని భావించేవారు. ఇందుకు ఉదాహరణగా సదుం మండలానికి చెందిన వారణాసి రామస్వామిరెడ్డి నిలుస్తారు. 1962లో కాంగ్రెస్ నుంచి పుంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామస్వామిరెడ్ఢి. 1967లోనూ ఇదే స్థానం నుంచి గెలుపొందారు. 1970లో జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం దక్కడంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. 1975 నుంచి ఆరేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలో జిల్లా పరిషత్ ఉంది. ఎర్రావారిపాళెంలో వైద్యురాలిగా ఉన్న కుతూహలమ్మను.. 1981లో ప్రస్తుత తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేయించారు. ఆమెను కోఆప్షన్ సభ్యురాలిగా ఎన్నిక చేసి.. కాంగ్రెస్ తరఫున ఏకంగా జడ్పీ ఛైర్మన్‌ను చేశారు. తర్వాత రామకృష్ణారెడ్డి, రాజశేఖర్, రామేగౌడు ఈ పదవిని దక్కించుకున్నారు.
ఇదీ చదవండి:8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు