అతడు ప్రేమ కోసం చనిపోయాడు.. ఇతడు ప్రేయసినే చంపేశాడు! - చిత్తూరు జిల్లాలో హత్య వార్తలు
ఒకరిది విడదీయలేని అనుబంధం.. మరొకరిది నమ్మక ద్రోహం.. కులం అడ్డుగోడలకు ప్రేయసి బలికాగా, ఆమె లేకుండా బతకలేనని ప్రియుడు తనువు చాలించారు. ప్రేమ పంచిన ప్రియురాలినే అంతమొందించింది మరొకరి కపటం. చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన ఈ విషాద ఘటనల ఉదంతం ఏంటో చూద్దాం.
శివశంకర్
By
Published : Nov 12, 2021, 12:36 PM IST
|
Updated : Nov 12, 2021, 3:07 PM IST
చిత్తూరు జిల్లా(chittoor district) రొంపిచెర్ల మండలం గానుగచింత వంకమద్దివారిపల్లెకు చెందిన శివశంకర్ (25) బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఐదు నెలల కిందట ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య(suicide) చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి చనిపోవడంతో శివశంకర్ మానసికంగా కుంగిపోయాడు. ‘ప్రియురాలు లేకుండా నేను బతకలేను’ అంటూ స్నేహితులతో తరచూ చెబుతుండేవాడు. బుధవారం రాత్రి పీలేరు-కడప మార్గంలో శ్రీవేంకటేశ్వర ఆలయం వెనుక చింతచెట్టుకు ఉరి వేసుకున్నాడు. ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నువ్వు లేకుండా నేను బతకలేకుపోతున్నా’ అంటూ లేఖ రాసి జేబులో పెట్టుకున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
నమ్మితే బలి తీసుకున్నాడు..
బిహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లా మధుసారియాకు చెందిన రాజ్‌దూత్, కవితకుమారి పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. రాజ్‌దూత్ చెన్నైలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ సన్నిహితంగా మెలగడంతో ఆమె గర్భం దాల్చింది. తనను వివాహం చేసుకోవాలని కవిత ఒత్తిడి చేయడంతో రాజ్‌దూత్ ఆమెను చెన్నై తీసుకొచ్చాడు. ఆపై చిత్తూరు సమీపంలోని ఓ కళాశాలలో ఆమెతో బీ ఫార్మసీ చేయించాలని నిర్ణయించాడు. గత నెల 11న ఆర్వీఎస్ కళాశాల ఎదురుగా ఉన్న విజయనగర్ ఎస్టీకాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. కళాశాలలో సీట్లు లేవని తెలియడంతో ప్రియురాలిని స్వగ్రామానికి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. వివాహం చేసుకోవాలని మరోసారి ఆమె పట్టుబట్టడంతో... అదే నెల 18న రాత్రి ముఖంపై దిండు పెట్టి హత్య(murder) చేశాడు. పాకాల సీఐ ఆశీర్వాదం, ఎస్సై నరేంద్ర కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామని చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి వివరించారు.