కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలీదు కానీ అవి మన జీవితాల్ని మలుపు తిప్పుతాయి. నా జీవితంలోనూ అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓసారి బైక్‌పై వెళ్తున్నా. పెద్ద శబ్దం. చూస్తే.. ఎదురుగా యాక్సిడెంట్. రక్తమోడుతున్న గాయాల మధ్య కొన ఊపిరితో ఓ కుర్రాడు. చుట్టూ గుమిగూడిన వాళ్లలో ఆత్రుత, కుతూహలం తప్పించి అతన్ని ఆస్పత్రిలో చేరుద్దామంటే ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి ఆ పని నేనే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలిసింది. అతనో అనాథ అని. నా చేతుల్లోనే చనిపోయాడు. జీవితంలో అంతకు ముందెప్పుడూ ఎదురుకాని క్షణాలవి. ఏం చేయాలో తోచలేదు. చివరికి ఆ అబ్బాయి దహన సంస్కారాలు నేనే చేయాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం మావారితో చెబితే ‘నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్...’ అన్నారు. చిత్రమేంటంటే.. ఆ అబ్బాయికి మాత్రమే కాదు, అదే రోజు మరో రెండు అనాథ శవాలకు సైతం నేనే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించా. రోడ్డుపై యాక్సిడెంట్ అయితే.. చాలామంది చూడ్డానికీ, దగ్గరకు వెళ్లడానికి కూడా సాహసించరు. ఒకవేళ సాయం చేయాలనిపించినా ఇంట్లో వాళ్లు ఏమంటారో, ఊళ్లో విషయాలన్నీ మనమీద వేసుకోవడం ఎందుకనే ఆలోచిస్తారు. కానీ ఆ రోజు నుంచీ నేనలా ఆలోచించలేకపోయా. జీవితాంతం ఎవరూలేరనే బాధతో తనువు చాలించిన అనాథలకు ఆఖరి యాత్రలోనైనా ఆ లోటు తీర్చాలని అనిపించింది. అందుకే ఆరోజు నుంచీ అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడం మొదలుపెట్టా.
నన్ను దూరం పెట్టేవారు...
మాది శ్రీకాళహస్తి. నాన్న నరసింహమూర్తి. అమ్మ లలితమ్మ. నాన్న నుంచే నాకీ సేవాగుణం అబ్బిందేమో. ఆయన అడిగిన వారికి లేదనకుండా సాయం చేసేవారు. నేను పదోతరగతి వరకే చదువుకున్నా. వివాహమయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మావారు భాస్కర్ గుప్తా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. నాన్న నాకు సేవాగుణాన్ని అందిస్తే... ఆ దారిలో నేను నిర్భయంగా నడిచేందుకు కావాల్సిన ధైర్యాన్ని మావారే అందించారు. నేను చేసే పనికి అత్తింటి నుంచి మద్దతు దొరికినా... తోటివారికి మాత్రం నచ్చలేదు. ‘ఆడవాళ్లు ఇలాంటి పనులు చేస్తారా?’ అంటూ ఎదురుగానే విమర్శించేవారు. ఏ శుభకార్యానికి వెళ్లినా అదోలా చూసేవారు. నేను కూర్చుంటే.. అక్కడి వాళ్లు లేచి వెళ్లిపోయేవారు. చాలా అవమానాలను ఎదుర్కొన్నా. ఒక సమయంలో డిప్రెషన్‌కు కూడా గురయ్యా. కుటుంబ సాయంతో మెల్లిగా అందులో నుంచి బయటపడ్ఢా ఓరోజు తెలిసినవాళ్లు అనాథాశ్రమంలో పుట్టినరోజు వేడుక చేసుకుంటూ నన్నూ పిలిచారు. అక్కడ పిల్లలని చూశాక మనసు చలించిపోయింది. మా అబ్బాయి పుట్టినరోజున ఆ పిల్లలకు పుస్తకాలు, బూట్లు, ఇప్పించా. ఆ ఒక్కపనితో నా బాధ్యత తీరిపోతుందని అనుకోలేకపోయా. అలాంటి అభాగ్యులకు అండగా ఉండేందుకు ఐదేళ్ల క్రితం ‘శ్రీసాయిశాంతి సహాయ సేవా సమితి’ అనే సంస్థను హైదరాబాద్‌లో ప్రారంభించా. ఈ సంస్థ స్థాపించడానికి మొదట్లో నలుగురు దొరకడం కష్టమైంది. అలాంటిది నేడు పన్నెండువందల మంది సభ్యులున్నారు. ఏ సేవా కార్యక్రమం నిర్వహించినా 300 మందికి తక్కువ కాకుండా హాజరవుతారు.
ఒంటరి మహిళలకు తోడుగా...