మూడు సంవత్సరాల క్రితం వరకు తాగేందుకు నీరు దొరకని.. కరువు ప్రాంతమది. వెయ్యి అడుగుల లోపలికి తవ్వితే తప్ప ప్రజల దప్పిక తీరేది కాదు. అలాంటి ప్రాంతంలో నేడు పాతాళ గంగ పరవశిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె, రామసముద్రం రోడ్డు మార్గంలో లాభాల గంగమ్మ గుడి ఉంది. ఇక్కడ కొండలు గుట్టలతో విస్తరించి ఉంటుంది. భక్తులు అవసరాల కోసం ఆలయ సమీపంలో ఓ దాత బోరును తవ్వించాడు. వెయ్యి అడుగులకు పైగా లోతుకు తవ్వించినా.. 6 నెలల క్రితం వరకు రెండించుల నీళ్లు మాత్రమే వచ్చేవి. తర్వాత కురిసిన వర్షాలకు భూగర్భజలాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ బావి నుంచి అత్యంత ఒత్తిడితో 20 అడుగుల ఎత్తు వరకు నీళ్లు ఎగిసిపడుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూడడానికి పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు అక్కడికి చేరుకున్నారు. గుట్ట ప్రాంతంలో ఉండే బోరుబావిలో ఇంత ఒత్తిడితో నీళ్లు రావడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. ఆలయంలో పూజలు చేసేందుకు 20 సంవత్సరాలుగా.. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారమని ఆలయ పూజారి పేర్కొన్నారు. ప్రస్తుతం మోటార్ వేయకుండానే పాతాళ గంగ భూమిపైకి వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
బోరుబావి నుంచి ఎగిసిపడుతున్న పాతాళగంగ..
నిన్నటి వరకు నీటి కోసం తీవ్ర అవస్థలు పడిన ఆ ప్రాంతంలో.. ఒక్కసారిగా 20 అడుగుల ఎత్తు వరకు నీరు ఎగిసిపడుతుండడం.. ఆ పరిసర ప్రాంత ప్రజల్లో ఆనందం నింపింది. ఈ దృశ్యం చిత్తూరు జిల్లా, మదనపల్లె శివారు ప్రాంతంలో దర్శనమిచ్చింది.
బోరుబావి నుంచి ఆకాశానికి ఎగిసిపడుతున్న పాతాళగంగ..