ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పిస్తానంటూ ఓ వాలంటీరు రూ. 4లక్షల వరకు వసూలు చేశారని సమాచారం. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని నాలుగో డివిజన్ పరిధి ఓ వార్డు వాలంటీరు.. సమీపంలో రద్దీ ప్రాంతంలో ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పిస్తానంటూ 37 మంది నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల కాగితాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు వాలంటీరును నిలదీశారు. ఈ వ్యవహారం స్థానిక వైకాపా నేతల దృష్టికి వెళ్లడంతో ఓ ప్రముఖుడు సర్దుబాటుకు ప్రయత్నించినట్లు తెలిసింది.
వసూళ్లకు పాల్పడిన వాలంటీరు వద్ద ఉన్నతాధికారుల పేరుతో ముద్రలు (సీళ్లు) ఉన్నాయని స్థానికులు తెలిపారు. లోగడ కూడా అక్రమాలకు పాల్పడిన ఈ వాలంటీరుకు సహకరించిన నాలుగో డివిజన్ వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శిని ఇటీవలే నగరపాలక అధికారులు బదిలీ చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో వాలంటీర్ నగదు వసూలు చేశాడనే అంశం తమ దృష్టికి రాలేదని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి తెలిపారు.