చిత్తూరు జిల్లా కుప్పం డీకే పల్లి చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం విషాదం నింపింది. కుప్పం ఎన్టీఆర్ కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న.. మురళి (12), జయసూర్య (12) సాయంత్రం చెరువు వద్దకు వెళ్లారు. కాసేపటికి... అక్కడ చిన్నారుల సైకిళ్ళు, దుస్తులు మాత్రమే ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా... హుటాహుటిన అక్కడికి చేరుకున్న బృందం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈత సరదా కోసం దిగి నీట మునిగి ఉంటారని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.