ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు సంపాదించటంతో పాటు... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయిలో అత్యుత్తమ పది నగరాల్లో ఒకటిగా నిలిచిన తిరుపతి నగరపాలక సంస్థ(తుడా) ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశలో చర్యలు చేపట్టింది. తిరుపతితో పాటు శివారు ప్రాంతాలతో కలిపి ఏర్పాటు చేసిన తుడా... అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానికి అవసరమైన నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆమోదించిన బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్)ను అమలు చేసే దిశగా రహదారులను అభివృద్ధి చేయనున్నారు. పార్కులు, ఆటస్థలాలు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు.
స్థిరాస్తి వ్యాపారానికి... 'తుడా' శ్రీకారం - sale
ఆదాయాన్ని పెంచుకునే దిశగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ పరిధిలోని ఖాళీ స్థలాల ద్వారా స్థిరాస్థి వ్యాపారానికి శ్రీకారం చుడుతోంది. ఖాళీ స్థలాల్లో ఆకర్షణీయ లేఔట్లు రూపొందించి వాటిని విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకొనే దిశగా సమాయత్తమవుతోంది.
ఖాళీ స్థలాలు విక్రయం
ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు గతంలో తుడా వేసిన లే అవుట్లలోని ఖాళీ స్థలాలను వేలం వేయాలని నిర్ణయించారు. తుడా నేతృత్వంలో మంగళం, కరకంబాడి వంటి వివిధ ప్రాంతాల్లో లే-అవుట్లు వేసి ప్లాట్లను విక్రయించగా కొన్ని మిగిలిపోయాయి. వీటిల్లో తుడా తరఫున ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు వీల్లేనందున... అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు.
తమ పరిధిలో సుమారు 80 ఖాళీ స్థలాలు విక్రయించేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించిన తుడా అధికారులు...బహిరంగ వేలం వేయడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. తుడా అధీనంలోని రేణిగుంట మండలంలో ఉన్న దాదాపు 45 ఎకరాలను లే-అవుట్ వేసి.. ప్లాట్లుగా విభజించనున్నారు. తర్వాత వీటిని సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.