తితిదే పరిధిలో ఉన్న ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. తితిదే పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌లో ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. సనాతన హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక కమిటీలు ఏర్పాటు చేయాలని.. కమిటీల సూచనలు, సిఫార్సులను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన చేయాలని చెప్పారు.
ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాలపై క్యాలెండర్ రూపొందించాలని ఈవో సూచించారు. ప్రతి ప్రాజెక్టులో నిపుణుల కమిటీ ఏర్పాటుచేసి ఆయా ప్రాజెక్టులపై పరిశోధనలు చేయాలన్నారు. సమాజ హితం కోసం వేద వ్యాప్తి జరగాల్సిన అవసరముందని, దేశ వ్యాప్తంగా ఉన్న 1400 మంది వేదపారాయణదారుల సంఖ్య మరింత పెంచి గ్రామ గ్రామాల్లో ప్రతిరోజూ వేద పారాయణం జరిగేలా చూడాలని అన్నారు.