తితిదే అవుట్సోర్సింగ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆవేదనను యాజమాన్యం అర్థం చేసుకుని వారి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని తితిదే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఎం.నాగార్జున కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద చేపడుతున్న నిరసన దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి.
ఆగని తితిదే అవుట్సోర్సింగ్ కార్మికుల నిరసన దీక్షలు
తితిదే ఔట్ సోర్సింగ్ కార్మికుల నిరసన దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. న్యాయపరంగా ఉన్న తమ డిమాండ్లకు తితిదే ఒప్పుకోవాలని కోరారు.
కల్యాణకట్ట ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెరుమాళ్, నాయకుడు మునిప్రకాష్... శుక్రవారం దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కార్మికుల్లో ఎక్కువ మంది తిరుపతి, పరిసర ప్రాంతాలకు చెందిన వారేనని, స్వస్థలం కావడంతో జీతాలు తక్కువైనా ఇక్కడే ఉండి కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల తితిదే సంస్థకు గానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గానీ కలిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు. సెస్సు రూపంలో తితిదేకి అదనంగా సంవత్సరానికి దాదాపు మూడు కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. తితిదేకి ఆర్థిక పరిపుష్టి కలిగిన తర్వాత దశలవారీగా టైం స్కేల్ వర్తింపచేయాలని కోరినా యాజమాన్యం ఖాతరు చేయడం ఆరోపించారు. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు సర్వీసు గల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తితిదే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:19ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... తమిళనాడు వాసి అరెస్ట్