పరిషత్ ఎన్నికల్లో తెదేపా కంటే వైకాపా ఎక్కువ స్థానాలు గెలిచిందని మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లో అసలు తెదేపా పోటీనే చేయలేదని.., వైకాపా అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలు బహిష్కరిందని గుర్తు చేశారు. వైకాపా నేతలు, కార్యకర్తలు ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, అరచకాలకు పాల్పడి ప్రజలకు అంబేడ్కర్ ఇచ్చిన స్వేచ్చను, చివరకు ఓటు హక్కును కూడా హరించారని ధ్వజమెత్తారు.
తెదేపా అధికారంలో ఉన్నపుడు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించి గెలిచామని.. వైకాపా మాదిరి దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి గెలవలేదని మండిపడ్డారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72, శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైకాపా బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్రం మెత్తం ఈ విధంగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.