తెదేపా అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్బంధించడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమిడి రమేశ్ ఆరోపించారు. చిత్తూరులో పర్యటిస్తే వైకాపా అక్రమాలు బయటపడతాయని భయపడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఆటవిక పాలనకు వైకాపా పురుడుపోసిందని తెదేపా శాసనభపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చీకటి రాజ్యం అలుముకుందని విచారం వ్యక్తం చేశారు. నేతలను నిర్బంధిస్తే ప్రజా సమస్యలు తీరవని జగన్ ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు.
ప్రజాస్వామ్యం, పరిపాలన గురించి తెలియని అంబటి రాంబాబు చంద్రబాబు గురించి మాట్లాడటం విచిత్రమని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. వైకాపా అరాచకాలను అడ్డుకునేందుకే చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారని అంబటికి తెలియదా అని నిలదీశారు.