Chandrababu on CM Jagan: కుప్పం నియోజకవర్గంపై వైకాపా నేతలు కక్ష కట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్ కాలనీలో ఆయన పర్యటించి మాట్లాడారు. 650 గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణం ప్రారంభించామని.. 1+3 విధానంలో 3వేల మందికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించి అనుమతులు ఇచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. కుప్పంపై సీఎంకు అభిమానం ఉంటే.. తాను 3వేల ఇళ్లు కట్టిస్తే ఆయన 10వేల ఇళ్లు కట్టించాలన్నారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఆపేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైకాపా నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నేరస్థుల పాలన ఎలా ఉంటుందో నిన్న చూశాం. కుప్పం చరిత్రలో అది చీకటి రోజు. ఈ నియోజకవర్గంపై మీకెందుకంత కోపం? పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. దాని నిర్వాహకునిపై దాడి చేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంటే దాన్ని ఇప్పటికీ సీఎం స్టాలిన్ కొనసాగిస్తున్నారు. హంద్రీనీవా పనుల్లో మరో రూ.50కోట్లు ఖర్చు చేసి ఉంటే నీళ్లు వచ్చేవి. నేను పులివెందులను అభివృద్ధి చేశాను. గండికోట నుంచి నీళ్లిచ్చాను.- చంద్రబాబు