సాధారణ పట్టభద్రులతో పాటు, ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉపాధి కోసం వెతుక్కుంటున్న ఈ రోజుల్లో.. తితిదే నిర్వహిస్తున్న శిల్పకళాశాల విద్యార్థులు మాత్రం కోర్సు పూర్తయ్యాక స్వయం ఉపాధిపొందుతున్నారు. 1960 సంవత్సరంలో సర్టిఫికెట్ కోర్సుతో ప్రారంభమైన తిరుపతి శిల్పకళాశాల.. రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థ గుర్తింపు పొందింది. గత యాబై సంవత్సరాల్లో వందల మంది విద్యార్థులకు శిల్ప, వాస్తు నైపుణ్యాలను అందించడంతో పాటు స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దుతోంది.
ఆలయ నిర్మాణం, శిలాశిల్పం, సుధాశిల్పం, ధారు శిల్పం, లోహ శిల్పం, సంప్రదాయ చిత్రలేఖనం, కళంకారీ విభాగాల్లో తిరుపతి శిల్పకళాశాల విద్యాబోధన చేస్తోంది. కళంకారీపై రెండు సంవత్సరాల డిప్లమో కోర్సు.. మిగిలిన విభాగాల్లో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు బోధిస్తున్నారు. నాలుగు సంవత్సరాల పాటు కళాశాలలో చదివిన విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ వంటి కోర్సుల ప్రవేశాలకు ఆర్హత సాధిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్న విశ్వాసం కళాశాల విద్యార్థుల్లో వ్యక్తమవుతుండగా.. శిక్షణ పూర్తిచేసుకున్న పూర్వ విద్యార్థులు తితిదే నిర్వహిస్తున్న శిల్ప తయారీ కేంద్రంలో ఉపాధి పొందుతున్నారు.