పచ్చని చెట్లు... అందమైన సెలయేళ్లు.... పక్షుల కిలకిలారావాలు... ప్రకృతి సోయగాలలో ఉండే సౌందర్యం తీరే వేరు. రాను రాను యాంత్రిక జీవనానికి దగ్గరవుతున్న మనిషి... అదే క్రమంలో ప్రకృతికి దూరమైపోతున్నాడు. స్వేచ్ఛగా గాలిలో తిరగాల్సిన ఎన్నో పక్షిజాతులు భూతాపాన్ని తట్టకోలేక అంతరించిపోతున్నాయి. అలాంటి పక్షులను, వాటి సౌందర్యాన్ని తన ఫొటోల్లో భద్రపరుస్తున్నాడు ఓ యువకుడు. వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నాడు.
ఇష్టంతో పేరు మార్చుకున్నాడు
గిరీష్ గ్రిల్స్.. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంటకు చెందిన వ్యక్తి. చదివింది బిటేక్. రాణిస్తోంది ఫొటోగ్రఫీ. ప్రపంచ ప్రఖ్యాత సాహసికుడు, ఎడ్వెంచరెస్ స్పెషలిస్ట్ అయిన బేర్ గ్రిల్స్‌ను అమితంగా ఇష్టపడే గిరీష్...అతనిలా ప్రకృతితో మమేకమై తన భవిష్యత్ ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. గిరీష్ గ్రిల్స్గా తన పేరును మార్చుకుని... చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన పక్షులపై అధ్యయనం ప్రారంభించాడు.
చదివింది బిటెక్ కానీ...
చదువుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఆ పక్షుల జీవనవిధానం గురించి తెలుసుకునేవాడు. క్రమంగా వీటిపై ఆసక్తి పెరిగింది. చదువుకున్నది బీటెక్ అయినా ఉద్యోగం వైపు మళ్లకుండా బర్డ్ వాచర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. క్రమేపీ పక్షుల జీవనవిధానంపై పట్టు సంపాదిస్తూ...కేవలం కంటిచూపుతోనే 500 రకాల పక్షులను గుర్తించి...వాటి గురించిన పూర్తి వివరాలు చెప్పగలిగే స్థాయికి చేరుకున్నాడు. మరో వైపు జీవవైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తున్న పక్షుల సంఖ్య... ప్రపంచీకరణ నీడలో తగ్గిపోతుండటం గురించిన అధ్యయనం చేసిన గిరీష్...ఇందుకు కారణమవుతున్న అంశాలపై పరిశోధన సాగించాడు.