చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ప్రస్తుతం అన్లాక్ ప్రకటించటంతో ఆలయానికి భక్తుల రాక మొదలైంది. ఆది, సోమ, మంగళవారాల్లో రాహు, కేతు పూజలు చేస్తారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయం కిటకిటలాడుతోంది.
అయితే జనం గుంపులుగా రావటంతో కరోనా ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. చాలామంది మాస్కులు ధరించడంలేదని.. భౌతిక దూరం మాటే లేదని అంటున్నారు. మరోపక్క కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.