ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతికి కష్టమే: ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా లేని రైళ్లు - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Special Trains for Sankranti : సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కానీ రైల్వే శాఖ ప్రకటించిన తేదీలు, రూట్లను పరిశీలిస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా లేవు..

Sankranti festival
సంక్రాంతి పండుగ

By

Published : Dec 25, 2022, 11:14 AM IST

Special Trains for Sankranti : సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో.. ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. మచిలీపట్నం-కర్నూలు, మచిలీపట్నం-తిరుపతి, విజయవాడ-నాగర్‌సోల్‌, కాకినాడ-లింగంపల్లి, పూర్ణ-తిరుపతి, తిరుపతి-అకోలా, మచిలీపట్నం-సికింద్రాబాద్‌ రూట్లలో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రానుపోను ఇరువైపులా కలిపి జనవరిలో మొత్తం 70 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ద.మ.రైల్వే ప్రకటించిన తేదీలు, రూట్లను పరిశీలిస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా లేవు.

మొత్తం ఎనిమిది రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే.. అందులో మూడు రూట్లు ఏపీ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగించేవి ఉన్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, తమిళనాడులోని చెన్నై నుంచి తెలుగు ప్రజలు సంక్రాంతికి పెద్దసంఖ్యలో వచ్చి వెళతారు. తాజా జాబితాలో చెన్నై, బెంగళూరుల నుంచి ఒక్క ప్రత్యేక రైలూ లేదు. హైదరాబాద్‌ నుంచి అత్యధిక రద్దీ ఉండే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక్క సంక్రాంతి ప్రత్యేక రైలునూ ప్రకటించలేదు.

ఉమ్మడి ప్రకాశం..రాయలసీమ జిల్లాలకూ తాజా జాబితాలో లేవు. హైదరాబాద్‌ నుంచి ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు పెద్దసంఖ్యలో వెళతారు. జనసాధారణ్‌ రైళ్లు కావాలన్న డిమాండ్‌ ప్రయాణికుల నుంచి ఉన్నా వాటి ప్రస్తావన లేదు. ముంబయి, సూరత్‌ వంటి నగరాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణకు వస్తుంటారు. అటు వైపు ప్రత్యేక జాబితాలో ప్రస్తావనే లేదు.

రద్దీ ఒకలా.. రైళ్లు మరోలా:సంక్రాంతి రద్దీ జనవరి 11-13 తేదీల్లో భారీగా ఉంటుంది. కానీ ద.మ.రైల్వే ప్రకటించిన సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో ఎక్కువ ఇతర రోజుల్లో ఉన్నాయి. జనవరి 1, 2, 3, 4 5, 6, 7 తేదీల్లో నడిపే ప్రత్యేక రైళ్లను సంక్రాంతి ప్రత్యేక రైళ్లుగా పేర్కొన్నారు. జనవరి 15న సంక్రాంతి పండగ అయిపోయాక 16, 17, 18 తేదీల్లో వెళ్లే రైళ్లను సంక్రాంతి జాబితాలో చేర్చింది. మచిలీపట్నం నుంచి కర్నూలుకు జనవరి 3, 5, 7, 10, 12, 14, 17.. లింగంపల్లి నుంచి కాకినాడకు 3, 5, 7, 10, 12, 14, 17, 19.. సికింద్రాబాద్‌ నుంచి మచిలీపట్నం 1, 8, 15 తేదీల్ల్లో ప్రత్యేక రైళ్లున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ పరిధిలో ఉంది. విశాఖపట్నం కేంద్రంగా వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ ఉంది. తెలుగురాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉత్తరాంధ్రవాసుల కోసం ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపే విషయాన్ని పట్టించుకోవట్లేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details