చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొరం గ్రామానికి చెందిన యువకుడు పవన్ పద్మనాభన్. స్కూల్ డ్రాపవుటైనా...తనకున్న మేథోసంపత్తితో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్లను అందుకున్నారు. ఇప్పుడు కరోనాపై పోరాటంలోనూ తనవంతుగా ప్రణాళికలు రచిస్తున్నారు. వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులైన...వైద్య సిబ్బందికి ఎక్కువగా వ్యాధి సోకే అవకాశాలపై అధ్యయనం చేసిన పవన్.. రోగికి సేవలందించేలా రోబోల వాడకంపై పరిశోధనలు చేశారు. 22వేల రూపాయల ఖర్చుతో రోబోకు రూపకల్పన చేశాడు. దానికి కోవిడ్-19 రోబోగా నామకరణం చేశారు.
కరోనా బారిన పడిన రోగులకు ఆహారం, ఔషధాలను ఈ రోబో అందిస్తుంది. ఇందులో టూవే కమ్యూనికేషన్ ఫెసిలిటీ, 360 డిగ్రీల కోణంలో రొటేటరీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు పవన్. అంతే కాదు ఇందులో వీడియో రికార్డింగ్ సదుపాయం ద్వారా....డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షించే విధంగా రోబోలో ఏర్పాట్లు చేశారు. ట్యాబ్ లేదా ఫోన్‌కి కనెక్టై ఆదేశాలను అందుకునేలా దీనిని తీర్చిదిద్దారు. రోగికి వంద మీటర్ల దూరం ఉంటూనే దీనిని ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ఇప్పటికే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రయల్ రన్ చేసిన పవన్... ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటి రోబోలను తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి తీసుకురావచ్చని చెబుతున్నారు.