రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలతో పాటు పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన హామీల అమలు చేస్తామని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ భరోసా యాత్ర జరుగుతోంది. యాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తిరుపతికి రానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వేదిక నుంచే.. హోదా ఏమైందంటూ ప్రశ్నించేందుకు ఆయన సిద్ధమయ్యారు. వెంకన్న సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయనున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారం అప్పగిస్తే.. ప్రత్యేక హోదా దస్త్రంపై తొలి సంతకం చేస్తామని ఇప్పటికే పలు వేదికలపై కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
నాడు మోదీ- నేడు రాహుల్
తిరుపతిలో సాగుతున్న భరోసా యాత్రలో నేడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అనంతరం జరగనున్న బహిరంగ సభలో ఏపీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయనున్నారు.
రాహుల్ గాంధీ (ఫైల్)
శుక్రవారం ఉదయం 11:50కి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయం రానున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని12:40 గంటలకు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4:35 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణమౌతారు.
రాష్ట్ర విభజన చేసి ప్రజల ఆగ్రహ జ్వాలలకు బలైన పార్టీ.. ప్రత్యేక హోదా అంశం ద్వారా తిరిగి తెలుగువారికి చేరువయ్యేందుకు తిరుపతి సభను వినియోగించుకోనుంది.
Last Updated : Feb 22, 2019, 9:51 AM IST