చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాయల చెరువు కట్టను సందర్శించి చెరువు పరిస్థితిపై జిల్లా నాయకులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు సత్వరమే సహాయక చర్యలను అందించాలని ఆయన కోరారు. తిరుపతి చుట్టుప్రక్కల చెరువులు, గొలుసు చెరువులన్నీ ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. అందువల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరైతే భూకబ్జాలు చేసి తప్పులు చేశారో.. శిక్షలు అనుభవించారో వాళ్లే ముంపు ప్రాంత ప్రజలకు బియ్యం, భోజనాలు పంచుతున్నారన్నారు. మరో వైపు పరామర్శకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం గ్రామస్థులు అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జరిగిన తప్పులను తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. మరోవైపు గండి పడ్డ ప్రాంతంలో ఇసుక మూటలతో పూడ్చేందుకు అధికారులు, గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు.
జగన్ రెండు గంటలు సర్వే చేసి వెళ్లారు..
వరదలు, అకాల వర్షాల కారణంగా ఎంతమంది చనిపోయారో తెలియదు..? ఎంత మంది గల్లంతయ్యారో తెలియదు..? రెండు గంటలు ఏరియల్ సర్వే చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోయాడని టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. మాజీమంత్రి పరసా రత్నం, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, తెదేపా జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నానిలతో కలసి రాయలచెరువు కట్టను సందర్శించారు. అనంతరం నక్కా ఆనంద్ బాబు మాట్లాడారు. తాత్కాలిక వసతి, భోజన వసతికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. ఈ అంశాలను పక్కదారి పట్టించడానికి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ జరుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతున్నారని ఆరోపించారు. విపత్కర పరిస్థితులలో డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చంద్రబాబు వరద బాధితులను పరామర్శించడానికి రేపు తిరుపతికి వస్తున్నారని అన్నారు.
నేవి హెలికాఫ్టర్ ద్వారా నిత్యావసరాల పంపిణీ..