మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు.. చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు నోటీసులు పంపారు. పుంగనూరుకు చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించి.. సాక్ష్యాధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి నుంచి చంద్రబాబుకు సీఆర్పీసీ 91 కింద ఈ నోటీసు జారీ చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబుకు పోలీసుల నోటీసులు - madanapalle dsp on chandrababu news
18:33 September 01
గతంలో.. ఓం ప్రతాప్ మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారన్న పోలీసులు... ఆగస్ట్ 27 న దినపత్రికల్లో వచ్చిన కథనాన్నినోటీసులో ప్రస్తావించారు. వారం రోజుల్లోపు తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చెప్పారు.
సాధారణ దర్యాప్తులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులిచ్చాం
చిత్తూరు జిల్లా కందూరులో ఓం ప్రతాప్ మృతికి సంబంధించిన దర్యాప్తులో సహకరించాలని కోరుతూనే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు నోటీసులు పంపించామని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. సాధారణ దర్యాప్తులో భాగంగానే నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మరో సీనియర్ నేత వర్లరామయ్యకూ నోటీసులు ఇచ్చామని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. వారు చేసిన ఆరోపణలపై వారం రోజుల్లో సాక్ష్యాధారాలు సమర్పించాలని కోరామన్నారు. నోటీసులు అందుకున్న వారు నేరుగా సాక్ష్యాధారాలను సమర్పించవచ్చని... లేదా తమకు సంబంధించిన వ్యక్తులతోనైనా పంపించవచ్చని డీఎస్పీ తెలిపారు.