ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఓ వ్యాపారవేత్తలా ప్రభుత్వరంగ ఆస్తుల విక్రయాలపై ఆలోచన చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరులోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఓవైపు అప్పులు చేస్తూ, మరోవైపు సామాన్యుల నడ్డివిరిచేలా పన్నులు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాపారవేత్తలా సీఎం ఆలోచనలు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలు పట్టించుకోకుండా సీఎం..వ్యాపారవేత్తల ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
పోర్టు, విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకం, సినిమా టికెట్లు, మాంసం విక్రయం వైపు అడుగులు వేస్తుండటాన్ని పరిశీలిస్తే సీఎం ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు. తన వాళ్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో జగన్ ఇలా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు శైలజానాథ్ సహా కాంగ్రెస్ నాయకులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామంటూ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు మాట మార్చారని, సర్దుబాటు పేరుతో ధరలు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు.