రసాయనిక ఎరువుల వాడకం రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోయి... అన్నదాతలకు చివరకు నష్టం వాటిల్లి అప్పులే మిగులుతున్నాయి. పైగా అనార్యోగం, భూసారం తగ్గి మరోపంట సాగుకు అవకాశం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన పాత వ్యవసాయ పద్ధతైన ప్రకృతి సేద్యం మేలని చెబుతున్నాడు పీలేరుకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు బో దేశవలి. దీని ద్వారా రైతన్నలు లాభపడడమేగాక, వాటిని ఆహారంగా తీసుకునే ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఆయన.
పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ రెడ్డివారిపల్లికు చెందిన రైతులు రత్న శేఖర్ రెడ్డి, జయచంద్రారెడ్డిలు. వీరు ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పీలేరు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలతో ఎకరం పొలంలో ఆర్ఎన్ఆర్ వరి సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. 43 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని.. ఎకరా వరి సాగుకు 13 వేలు ఖర్చు అయ్యిందన్నారు. కలికిరి మండలంలో కృష్ణారెడ్డి అనే రైతు సేంద్రీయ పద్ధతులతో ఆపిల్ బేర్ పంట సాగు చేశారు. ఇప్పటి వరకు తెగుళ్ల బెడద రాలేదన్నారు.