బెంగళూరులోని ఓ ఇంట్లో 90 లక్షల రూపాయలు దొంగిలించి తీసుకు వస్తున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులోని యంహెచ్ఆర్ లేఅవుట్లో ఎర్రప్ప అనే వ్యక్తికి చెందిన ఇల్లు తాళం వేసి ఉండగా... తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు... 90 లక్షల రూపాయలను కాజేశారు.
నగదును రెండు బ్యాగుల్లో సర్దుకొని.. బెంగళూరు నుంచి చిత్తూరుకు కారులో బయల్దేరారు. వారిని బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలోని గండ్రాజుపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసుల పట్టుకున్నారు. నిందితులను పశ్చిమ బంగ రాష్ట్రానికి చెందిన శుభంకర్ షిల్, సంజూ సాహూలుగా గుర్తించారు. బాధితుడు ఎర్రప్పకు పోలీసులు సమాచారం అందించగా... ఆ నగదును తన మనవడి పీజీ సీట్ కోసం దాచుకున్నట్లు తెలిపాడు. పట్టుబడిన ఇద్దరినీ.. జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తున్నట్లు పలమనేరు డీఎస్పీ గంగయ్య మీడియాకు తెలిపారు.