Illegal mining: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ముద్దనపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ దక్షిణాది జోన్ (చెన్నై) తీవ్రంగా స్పందించింది. అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నదో, లేదో శాఖలవారీగా 26వ తేదీలోగా నివేదికలు ఇవ్వాలని జస్టిస్ పుష్ప సత్యనారాయణ, డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కమిటీ నియామకానికి ఉత్తర్వులిచ్చారు.
ఇందులో కలెక్టర్, డీఎఫ్‌వో, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి, గనులశాఖ ఏడీ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అయితే కమిటీల పేరుతో కాలయాపన చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అక్రమ మైనింగ్ ఆరోపణలు వస్తున్న సర్వే నంబర్లలో ‘అడవి’ ఉందని నివేదికల్లో చెబుతున్నా, అక్కడ మైనింగ్ గురించి అటవీశాఖ వివరాలు చెప్పడం లేదన్నారు. గనులు, భూగర్భశాఖ 3 రకాల లీజులు ఇచ్చినట్లు చెబుతున్నా సర్వే నంబర్లపై స్పష్టత ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.