వైభవంగా సాగిన నటరాజ స్వామి కల్యాణోత్సవం - శ్రీకాళహస్తీ తాజా వార్తలు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శివకామ సుందరి సమేత నటరాజ స్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శివకామ సుందరి సమేత నటరాజ స్వామి కల్యాణోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. తారకాసుర సమరానికి నాందిగా ఉమామహేశ్వరుల కల్యాణంతో సమస్త దేవగణాల ఆనందడోలికల్లో మునిగి తేలుతుంటారు. ఆ సమయంలో జగద్రక్షకుడైన సర్వేశ్వరుడు ఆనందంతో ఉప్పొంగి తన దేవేరితో కలసి ఆనందంగా తాండవం చేయడమే ఈ విశేష ఉత్సవ పరమార్థం. అచ్యుతరాయ మండపంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అనువంశిక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ సంకల్ప పూజలు ప్రారంభించారు. ఆగమోక్తంగా వివాహ క్రతువుని జరిపి.. ఉత్సవమూర్తులకు ధూప దీప నివేదన సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు మాడవీధుల్లో ఊరేగారు.