లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం.. సాయంత్రం కుప్పంలో బహిరంగ సభ LOKESH YUVAGALAM PADAYATRA : జనగళాన్ని యువగళంగా మలుచుకుంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన మహాపాదయాత్ర తొలిరోజు జైత్రయాత్రగా సాగుతోంది. సైకో పాలనను సాగనంపుదాం అనే నినాదంతో కుప్పంలోని ప్రసన్నవరదరాజస్వామి ఆలయంవద్ద పాదయాత్రకు తొలి అడుగు వేశారు. వేలాది కార్యకర్తల జయజయద్వానాల మధ్య చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
ఆలయ ప్రాంగణంలో ఉదయం 11గంటల 03 నిమిషాలకు తొలిఅడుగువేసి పాదయాత్ర ప్రారంభించారు. కార్యకర్తలు యువనేతపై పూలవర్షం కురిపిస్తూ, బాణాసంచా కాలుస్తూ హోరెత్తించారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా 400రోజులపాటు 4వేల కిలోమీటర్ల పొడవున యువగళం యాత్ర సాగనుంది.
పాదయాత్ర ప్రారంభమయ్యాక దారిపొడవునా మహిళలు హారతులిస్తూ లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. గత 40ఏళ్లుగా చంద్రబాబుపై అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్న కుప్పం ప్రజలు యువనేత చేపట్టిన పాదయాత్రకు ఆశీస్సులు అందజేస్తూ సంఘీభావం తెలిపారు. మార్గమధ్యంలో భారీ గజమాలను యువనేతకు అలంకరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువనేతతో కరచాలనం చేసేందుకు యువతీయువకులు పోటీపడ్డారు.
వరదరాజస్వామి ఆలయంలో పూజల అనంతరం లక్ష్మీపురం మసీదును లోకేశ్ సందర్శించారు. మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్న లోకేశ్‌కు..ముస్లిం మత పెద్దలు ఆశీర్వచనం అందించారు. అనంతరం కుప్పంలోని బాబూనగర్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు. సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో కుప్పం వీధులన్నీ కిటకిటలాడాయి. యువనేత వెంట భారీగా కదిలిన పసుపుదండుతోపాటు స్థానికులను అదుపుచేయడం భద్రతాసిబ్బందికి కష్టంగా మారింది.
డప్పు వాయిద్యాలు, తీన్మార్ దరువుల మధ్య డాన్సులు చేస్తూ యువతీ యువకులు..... లోకేశ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కుప్పం బస్టాండ్ సమీపంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగువాడి గుండెచప్పుడు నందమూరి తారక రామారావు, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 2గంటలకు కుప్పం తెదేపా కార్యాలయానికి చేరుకున్న లోకేశ్.. అక్కడ భోజన విరామం తీసుకున్నారు.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న: సినీనటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్ ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్థానిక నేతలు ఆయన్ను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
మొదటి రోజు పాదయాత్ర ముగించుకున్న నారా లోకేశ్ అస్వస్ధతకు గురై పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంప్ సైట్లో బస చేశారు. రెండో రోజు 9.3 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనున్నారు.
లోకేశ్‌కు ఆల్ ది బెస్ట్ చెపుతూ చంద్రబాబు ట్వీట్: యువగళం పాదయాత్రకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా లోకేష్ పాదయాత్రకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. యువత భవిత కోసం..ప్రజల బతుకు కోసం.. రాష్ట్ర భవిష్యత్ కోసం..లోకేశ్ పాదయాత్ర అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: