జిల్లా నుంచి అధికార వైకాపా తరఫున 13 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తరుణంలో.. పదవులను ఎలా సర్దుబాటు చేస్తారన్న మీమాంసకు తెరదించుతూ.. జగన్ వీరిద్దరివైపు మొగ్గు చూపారు. తూర్పు నుంచి నారాయణస్వామి, పశ్చిమ ప్రాంతం నుంచి పెద్దిరెడ్డికి అవకాశం లభించింది. ప్రతిపాదిత కొత్త జిల్లాల కోణంలో చూసినా.. చిత్తూరు, రాజంపేట లోక్‌సభ పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం దక్కినట్లు చెప్పొచ్చు.
నడిపించిన నాయకుడు
పెద్దిరెడ్డి రామచంద్ర అను నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాప నాయకుల్లో తొలి నుంచి జగన్‌తోపాటు కలిసి నడిచిన నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్ఢి. అధిష్ఠానానికి అన్నీ విషయాల్లో అండగా ఉంటూ... పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించే పూర్తిస్థాయి బాధ్యత తీసుకున్నారు. కృష్ణా జిల్లాకు వైకాపా ఇన్‌ఛార్జిగా పనిచేశారు. జగన్ పాదయాత్రలోనూ క్రియాశీలంగా వ్యవహరించారు. సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలం, తంబళ్లపల్లి నుంచి గెలిచిన ద్వారకానాథ్‌రెడ్డి, జీడీ నెల్లూరు నుంచి గెలిచిన నారాయణస్వామి, పూతలపట్టు విజేత ఎంఎస్ బాబు, మదనపల్లి నుంచి గెల్చిన నవాజ్‌బాషాలకు మార్గదర్శనం చేశారు. స్వయంగా ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా, సోదరుడు ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమకాలికుడిగా, వైఎస్సార్ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.
సమీకరణాల్లో ముందుకు... గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన కె.నారాయణస్వామికి సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి లభించింది. రాజకీయ నేపథ్యంతోపాటు కష్టకాలంలో పార్టీని సమర్థంగా నడిపిస్తూ, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కలిగిన నారాయణస్వామికి పెద్దిరెడ్డితోపాటు కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి, రోజాతో సత్సంబంధాలున్నాయి. ఆయన ఎంపిక అందరికీ ఆమోదయోగ్యమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సామాజికవర్గం వారు ఎక్కువగా పోటీ పడిన తరుణంలో.. ఎస్సీ కోటా నుంచి నారాయణస్వామికి అవకాశాలు కలిసొచ్చింది.