అమరావతి అంశంపై రెఫరెండానికి తాము సిద్ధంగా ఉన్నామని వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు జిల్లా నగరం మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వార్థపూరిత రాజకీయాల కోసమే అమరావతిపై ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు నటిస్తున్నారని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో 1300 కోట్ల రూపాయలతో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ప్రజా ధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి రైతులను తెదేపా నేతలు మోసం చేశారన్నారు. రాజధాని పేరుతో దోచుకున్న భూములను కాపాడుకునేందుకే కొంతమందిని రెచ్చ కొట్టి నిరసనలు చేయిస్తున్నారని ఎంపీ దుయ్యబట్టారు. వైకాపా తలుపులు తెరిస్తే పార్టీలోకి వచ్చేందుకు తెదేపా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని మోపిదేవి చెప్పారు.
చంద్రబాబుకు ప్రతి సవాల్
మూడు రాజధానులపై తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తెదేపా తీసుకోవాలి. తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలి. మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానం. ఇంతకంటే రెఫరెండం ఏముంటుంది. తిరుపతి ఎన్నికలతో ఎవరేంటో తేలిపోతుంది- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి