తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులతో పాటు.. నగర వాసులతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను తీర్చే పనిలో పడింది నగర పాలక సంస్థ. ఇందు కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హథీరాం మఠం భూములను లీజు ప్రాతిపదికన తీసుకొనేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నిర్ణయంతో మల్టీ లెవల్ పార్కింగ్, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు చేసేందుకు సిద్ధమైంది.
తిరుపతి నగరంలో దాదాపు రెండు లక్షల ద్విచక్రవాహనాలు.... వేల సంఖ్యలో కార్లు ఉన్నాయి. వీటికి తోడు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులతో కార్లు, జీపులు, సుమోలు అధిక సంఖ్యలో తిరుపతికి వస్తాయి. నగరంలో సరైన పార్కింగ్ సదుపాయం లేని కారణంగా.. ఎక్కడపడితే అక్కడ ఆపేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాణిజ్య సముదాయాల ముందు వాహనాలను ఆపివేస్తున్న ఫలితంగా.. ఆయా దుకాణాలకు వెళ్లే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ వ్యాపారంపై ఇది ప్రభావం చూపిస్తోందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.