ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 30, 2020, 3:27 PM IST

ETV Bharat / state

మెప్మాలో అక్రమాలు.. నకిలీ ధ్రువపత్రాలతో విధులు!

రాష్ట్ర ప్రభుత్వం నెలకు 10 వేల రూపాయల వేతనం ఇవ్వాలని నిర్ణయించడంతో.. ఆర్పీలుగా చేరేందుకు దొడ్డిదారిన ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకు మెప్మా అధికారులు కొందరు సహకారం అందించటంతో.. నకిలీ ధ్రువపత్రాలతో, బినామీ పేర్లతో ఆర్పీలుగా పనిచేస్తున్నట్లు వెలుగు చూసింది. కొందరు మార్ఫింగ్ ధ్రువపత్రాలను సమర్పించటం, ఇంకొందరు ఇతరుల ధ్రువపత్రాల మీద విధులు నిర్వర్తించటం కలకలం రేపుతోంది.

mepma employees fake certificates
మెప్మాలో అక్రమాలు

తిరుపతి నగరపాలకలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పరిధిలో నాలుగు పట్టణ సమాఖ్యుకు చెందిన 4,730 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందుకు 160 మంది రిసోర్స్ పర్సన్(ఆర్పీ) పనిచేస్తున్నారు. స్వయం సహాయక సంఘాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండే ఆర్పీ పదవులకు డిమాండ్ ఏర్పడింది. సమాఖ్యలు నిర్వహణకు నెలకు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు జీతంగా ఇచ్చేందుకు నిర్ణయించటంతో.. ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొందరు ఆర్పీలు ప్రభుత్వం సూచించిన అర్హతలు లేకపోయినా కొనసాగేందుకు అక్రమ మార్గాల్ని ఎంచుకున్నట్లు సమాచారం. అందుకు లక్ష్మీపురం సమాఖ్య ఉదంతమే నిదర్శనం.

అసలు ఏం జరిగిందంటే..

లక్ష్మీపురానికి చెందిన ఓ ఆర్పీ విధుల్లోకి చేరిన సమయంలో ఏడో తరగతి వరకు చదవినట్లు చెప్పటంతో.. ఆమె విద్యార్హత దరఖాస్తును ఆన్​లైన్​లో పరిశీలించగా.. ఏర్పేడులోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించినట్లు ఉంది. ఈ ధ్రువపత్రాల నకలుతో పాఠశాలకు వెళ్లి విచారించగా.. అది సమీప గ్రామానికి చెందిన మరో బాలికదని పాఠశాల ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. వెంటనే ఆర్పీని ఫోన్​లో సంప్రదించగా.. తాను తిరుపతిలో ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదివాననీ.. ఇప్పుడు అది లేదని తెలిపారు. ఆన్​లైన్​లో అప్​లోడ్ చేసిన ధ్రువపత్రాలను నిశితంగా పరిశీలిస్తే.. విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫోటో, పుట్టుమచ్చలు మార్చినట్లు తేలింది.

ఇలా ఉంది ఈ ఒక్క ఆర్పీనే కాదు.. విచారణ చేస్తే నకిలీ ధ్రువపత్రాలతో విధుల్లో చేరిన వారు పెద్ద సంఖ్యలో ఉండొచ్చని సమాచారం.

నకిలీ ధ్రువత్రాలు గురించి కొందరు ఫిర్యాదు చేశారు. రాతపూర్వకంగా వాస్తవాలు తెలియజేయాలని సీఎంఎం వెంకటరమణకు తాఖీదులు ఇచ్చాం. బినామీ పేర్లతో పేర్లతో పనిచేస్తున్న ఆర్పీల గురించి విచారణ జరుపుతాం. వాస్తవం అయితే తప్పకుండా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.- ఏడీ జ్యోతి, పథక సంచాలకులు

ఇదీ చదవండి:గుడారు లక్ష్మయ్యనాయుడు మృతి పట్ల ఉప రాష్ట్రపతి సంతాపం

ABOUT THE AUTHOR

...view details