వాళ్లిద్దరూ విద్యావంతులు. పది మందికి.. మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత గల స్థానంలో ఉన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు అందించాల్సిన వృత్తి వారిది. ఈ హోదా, విచక్షణ ఏదీ... మూఢ నమ్మకాల ముందు నిలవలేదు. ఇప్పుడున్న ప్రశాంత జీవితాన్ని కాదని...ఇంకేదో కావాలని... అత్యంత దారుణంగా...కన్న పిల్లల్నే చంపుకొన్నారు ఆ దంపతులు. క్షుద్ర పూజలు చేసి ఈ అకృత్యానికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఆదివారం రాత్రి వెలుగు చూసిన..ఈ అమానుష ఘటన.. కలకలం రేపింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మూఢనమ్మకాలు, ఆ పేరున సాగే దారుణాలు... అంతకంటే ఒక మెట్టు పైనే ఉంటాయని మరోసారి నిరూపించింది... ఈ దారుణం.
మంత్రాలకు బలి!
ఆ తండ్రి అలాంటి ఇలాంటి సాధారణ వ్యక్తి కూడా కాదు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు.. నిందితుడు ఎన్.పురుషోత్తంనాయుడు. భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్. పిల్లలు కూడా మంచి విద్యావంతులే. పెద్దమ్మాయి అలేఖ్య, చిన్నమ్మాయి సాయిదివ్య. పెద్దామె భోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నామె బీబీఏ చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. గతేడాది ఆగస్టులోనే కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి వచ్చారు. ఇలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేశాయి... మూఢనమ్మకాలు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెలను... అవన్నీ మరచి నిర్థయగా మంత్రాలకు బలి ఇచ్చారు ఆ తల్లిదండ్రులు.
శూలంతో పొడిచి.. చెంబుతో కొట్టి
నిజానికి వాళ్లు ఇలా పూజలు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచీ... తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. అలానే ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించారు. కానీ ఈసారి మూఢత్వం మరింత పతాకస్థాయికి చేరింది. అంత చదువుకున్న ఆ కన్నవారు ఎలా ఈ ఘాతుకానికి ఒడిగట్టారు? మంచి చదువులు చదువుకున్న ఆ పిల్లలు మాత్రం వారి చర్యలను ఎలా అంగీకరించారు? అసలు వాళ్లను ఆ మానసిక ఉన్మాదస్థితికి తీసుకుని వెళ్లిన వ్యక్తులు ఎవరు? పరిస్థితులు ఏమిటి? ఇవన్నీ ఎలా ఉన్నా రెండు నిండు ప్రాణాలు అన్యాయంగా బలి అయిపోయాయి. మొదట చిన్న కుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు.
దైవభక్తిలో లీనమై..
విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డీఎస్పీ సహా.. పలువురు పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక్కడే విస్తుగొలిపే విషయాలు కొన్ని వెలుగుచూశాయి. హత్యకు గురైన పిల్లలు, చంపిన తల్లిదండ్రులు...పూర్తిగా దైవభక్తిలో లీనమై పోయారని, వారు తమ బిడ్డలు మళ్లీ బతుకుతారని చంపేసినట్లు ప్రాథమికంగా తేలింది. పద్మజ బిడ్డలను కొట్టి చంపినట్లు, ఈ సంఘటన జరిగినప్పుడు తండ్రి పురుషోత్తం నాయుడు కూడా అక్కడే ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. వారిద్దరూ మానసికంగా సతమతమవుతున్నట్లు గుర్తించారు పోలీసులు.
'శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్'